Thursday, 31 October 2013

ఆంధ్రాశబరిమలై

ఒకరోజు నా ఫ్రెండ్ నాగశ్రీ ఒక టూర్‌గురించి చెప్పింది. వాళ్ళ ఫేమిలీతో కలిసి ఆంధ్రాశబరిమలై వెళ్ళారట. తను చెప్పిన విశేషాలు వినగానే, నాకుకూడా వెళ్ళాలనిపించింది. నేను వెళ్ళి అమ్మను అడిగాను. అమ్మ `సరేలే, తరువాత చూద్దాం,` అనిచెప్పింది. తరువాత కొన్ని రోజులకి అమ్మ, బావజ్జీ, చెల్లీ, నేను కలసి ఆంధ్రా శబరిమలై వెళ్ళాము. అది శంఖవరంలో ఉంది.
గుడికి చాలామంది వచ్చారు. గుడిలో అయ్యప్పస్వామిని ఉయ్యాలలో పడుకోబెట్టి, వుయ్యాలఊపుతున్నారు. నేనుకూడా ఊపాను. అది చాలా బాగుంది. నాపేరుమీద, చెల్లి వర్షిత పేరుమీదా అన్నదానానికి డబ్బులు కట్టారు. 

గుడిబట ఒక నుయ్యి ఉంది. దానిలో నిండా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ అడుగున చాలా డబ్బులు ఉన్నాయి. గుడికి వచ్చినవాళ్ళు వేస్తారని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. నూతికి ఒక గిలక ఉంది. దానిపైనుంచి నీరుతోడుకొనే బకెట్‌తాడు వేశారు. నీరు తోడడానికి చాలా ఈజీగా అనిపించింది. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. వాటితో కాళ్ళు కడుకొన్నాం. ఇంకా నీళ్ళు తోడతామని నేనూ, చెల్లీ పోట్లాడుకొంటుంటే, మమ్మల్ని తిట్టి అక్కడినుంచి తీసుకొని వెళ్ళారు.
అక్కడినుంచి ధార జలపాతం దగ్గరకి వెళ్ళాం. కారు వదిలేసి చాలా దూరం నడచి వెళ్ళాం. మా కూడా తెచ్చుకొన్న భోజనాల కేరేజీలని ఒక్కొక్కరం ఒక్కొక్కటి పట్టుకొని నడిచాం. చాలా సేపు వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకొన్న తరువాత భోజనాలు చేశాం. ఫోటోలు తీసుకొన్నాం. చాలా హ్యాపీగా ఉంది.

అక్కడినుంచి శాంతి ఆశ్రమం వెళ్ళాం. మాతాజీ ఉన్నారు. ఆవిడ ఆశీర్వాదం తీసుకొన్నాం. అక్కడికి మావూరు(ఇప్పుడు మేం అక్కడ ఉండటం లేదు లెండి. మా డాడి చిన్నపుడు ఉండేవారట) రాచపల్లి చాలా దగ్గర. అందుకనే అక్కడికి వెళ్ళం. ఇల్లు, పెరడు అంతా తిరిగి చూశాం. పెదతాతయ్య వాళ్ళూ అక్కడే ఉన్నారు. కొంచెంసేపు ఉండి బయలుదేరి కాకినాడ వచ్చేశాం. దారిలో మా డాడీ చదువుకొన్న స్కూలు అవీ చూపించారు. ట్రిప్ చాలా బాగుంది. అంతే!
 

No comments:

Post a Comment